Vanilla Ice Cream Recipe - Home Made Ice Cream Recipe
ప్రస్తుతం వేసవికాలం సెలవులు వల్ల పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. వేసవికాలం కావడం వలన ఎండలు కూడా విపరీతంగానే ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్నం పూట పిల్లలు, కేవలం పిల్లలు మాత్రమే కాదండోయ్ పెద్దవారు కూడా చల్ల చల్లగా తినడానికి ఇంట్లోనే సులభంగా ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వెనీలా ఐస్ క్రీమ్ ను తయారు చేసుకునే విధానాన్ని చూసేద్దాం . బయట కొనే ఐస్ క్రీమ్స్ లో కెమికల్స్ ఉంటాయి. కాబట్టి ఇంట్లోనే దొరికే వస్తువులతో సులభంగా, రుచికరంగా,ఆరోగ్యకరంగా వెనీలా ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు
పాలమీగడ - 1 కప్పు
చిక్కని పాలు - 1 కప్పు
వెనీలా ఎసెన్స్ - 1/2 టీ స్పూన్
కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్
పంచదార పొడి - 1/2 కప్పు
కొలతలకి గాను ఒకే గ్లాస్ ని కానీ కప్పుని కానీ వాడండి. ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేసే విధానాన్ని చూసేద్దాం.ముందుగా స్టవ్ వెలిగించాలి. ఇప్పుడు స్టవ్ ని మీడియం లో పెట్టి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టి ఒక కప్పు పాలల్లోంచి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పాలని పక్కన పెట్టి మిగిలిన పాలన్నీ గిన్నెలో పోసేయాలి.
ఇప్పుడు పక్కన పెట్టిన నాలుగు టేబుల్ స్పూన్ల పాలని ఒక చిన్న గిన్నెలో తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద పాలు కాస్త మరిగాక స్టవ్ ని సిమ్ లో పెట్టి కార్న్ ఫ్లోర్ మిక్సర్ ని ఆ పాలలో కలిపి పాలు గిన్నెకి అడుగంటకుండా గరిటతో కలుపుతూ ఉండాలి. ఒక అయిదారు నిమిషాల పాటు ఇలా బాగా పాలని కలిపాక పాలు చిక్కబడతాయి. ఇప్పుడు ఆ పాలని స్టవ్ మీద నుంచి దించి చల్లారడానికి పక్కన పెట్టేయాలి.
ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు తాజా పాల మీగడ ను తీసుకుని దాంట్లో అర టీ స్పూను వెనీలా ఎసెన్స్ ని వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు విస్కర్ సాయంతో పాలమీగడను బాగా కలపాలి. మనం ప్రతి రోజు పాల మీద వచ్చే మీగడని ఒక వారం పాటు ఫ్రిడ్జ్ లోని డీ ఫ్రీజర్ లో అట్టి పెడితే మనకు కావలసిన ఒక కప్పు పాల మీగడ తయారవుతుంది. ఇలా పాల మీగడ ఇంట్లో లభించని వారు బయట సూపర్ మార్కెట్స్ లో దొరికే ఒక కప్పు హెవీ క్రీమ్ ని వాడొచ్చు. ఇప్పుడు కొద్దిగా గట్టి పడిన క్రీమ్ లో అర కప్పు పంచదార పొడిని వేసి మరో రెండు, మూడు నిమిషాల పాటు బాగా కలపాలి. ఇప్పుడు ఈ క్రీమ్ లో ఇందాక చల్లారడం కోసం పక్కన పెట్టిన పాలను కలిపి మరొక్క నిమిషం పాటు పాలు, క్రీము అన్ని కలిసేలా ఒకసారి బాగా విస్కర్ తో కలపాలి.
తర్వాత ఇలా తయారైన ఐస్ క్రీమ్ గిన్నెని డీ ఫ్రీజర్ లో రెండు గంటల పాటు ఉంచాలి. రెండు గంటలు అయ్యాక ఐస్ క్రీమ్ గిన్నెను డీ ఫ్రీజర్ లోంచి బయటకు తీసి కేవలం రెండు నిమిషాల పాటు ఒకసారి విస్కర్ తో బాగా కలపాలి. ఇప్పుడు ఇంక ఐస్ క్రీమ్ తయారు అయిపోయినట్టే. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో లేదా అదే గిన్నెలో ఒక మూత పెట్టి డీ ఫ్రీజర్ లో 5 నుంచి 6 గంటల పాటు ఉంచాలి. అంతే 5 నుంచి 6 గంటల తర్వాత ఎంతో ఆరోగ్యకరమైన,రుచికరమైన వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది.
కేవలం 20 నిమిషాల లోపే ఎంతో రుచికరమైన వెనీలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి మీ పిల్లలకి తయారు చేసి పెట్టి చూడండి. అలాగే ఐస్ క్రీమ్ ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.
వెనీలా ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావలసిన ఫ్రెష్ క్రీమ్, వెనీలా ఎసెన్స్ మరియు కార్న్ ఫ్లోర్ లింక్స్ కింద ఇచ్చాను కావలసినవారు అక్కడ ఆర్డర్ చెయ్యండి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి